Pages

Saturday 22 August 2015

రంగులడబ్బా సరిజేసుకో బిడ్డా ....



     








రంగులడబ్బా  సరిజేసుకో బిడ్డా ..... 





పొద్దుగాల నుండి  గా  రంగుల  డబ్బాలోకెల్లి ,
ఒకటే  ఒర్లుడు , పోరగాల్లు  తినేటివేన్దో   పాడయి  జచ్చినాయంట ,

అస్సలు  గీళ్ళకి  తెల్సా.. ..,
మా ఇంట్ల  పోరగాల్లకి  బువ్వ దొరుకుడే  కష్టం ,

గాయమ్మ   ఎవ్వరో   సిన్మాపోరినట  ఎవ్వనినో  ప్రేమించినదనీ... ,
పెళ్ళిలో  కెల్లి  పారిపోయినాదనీ .... ఒకటే    సూపెట్టుడే ,


కులపోల్ల    అదిలింపుల్లో ... ..పురుగుల మందు దాగి,
ఊరిపొలిమేరల్లో  పోయిన  మన   ఊరి పోరి  కనిపించలేదారా...? 

అరె  బస్టాపలకెల్లి    బద్మ్మాష్ గాళ్ళు ,
ఆడపోరిలను  ఆగమ్జేస్తుండ్రు   గదా...  గది  కన్పడదా.... ?

గాయనెవరో   పైదేశానికెల్లి    పైసలుబోసి  పొట్ట  మెలికలు  దిప్పుచ్చుకున్నాడంట ,
ఇక్కడ   కడుపుతోనున్న  ఆడకూతురు  ఆసుపత్రిబైటనే  పురుడుబోసుకొని  పీనిగయ్యింది,
గది కానొస్తలేదారా  మీకు ,

సూటూ  బూటూ   ఏసుకున్నోల్లనో,
సినిమా  హీరోలనో,
కాలేజీ పోరగాళ్ళనో,
సైబరు కేటుగాళ్లనో ,
షాపింగ్ బేరగాళ్లనో ,
దొంగనోట్ల  దొరగాల్లనో ,
కబ్జాల  గజ్జిగాల్లనో,
దొంగ బాబాగాల్లనో ,
రంగుటుంగరాల్లోల్లనో , కాదురా  మీ  ఇంటర్యూలతో   ఊదరగొట్టుడు....,

ఇల్లులేనోళ్లనీ,  కళ్ళులేనోళ్లనీ, రోగాలు  ముసురుకున్నోల్లనీ, మురికి  కాలువల్లో  కాపురమున్నోల్లనీ, దోమలతో దోస్తీజేసేటోల్లనీ, ముస్టోల్లనీ, కుస్టోల్లనీ,  అనాథలనీ, అన్నార్తులనీ ...ఇంటర్యూ  జేయండి ...., గాళ్ళ  లొల్లి  ఏందో   ఎల్లబెట్టుండ్రి . 

రంగుల డబ్బాకు   హంగులే   కాదు  ఆకలి    జూపించుడు  ఎప్పటికీ  తెల్వదా ??? 

  


  


Friday 14 August 2015

నువ్వేనా...?











నువ్వేనా...?

సుదీర్గ    నిశ్శబ్దం   ఆవల ,
అనంత  ఒంటరితనం  వెనుక  నక్కిన ,
అలుపెరుగని  నా  మనో కలల
అన్వేషితవు  నీవేనా...?


నా భుజం  పై  నేనే  తలవాల్చుకొని ,
ఒకింత  ఓదార్పుని  ఆశించిన  క్షణాన,
వెన్నంటి   ఉన్న  మనో చాయని ,
ఏమార్చిన   విభావరి   నీవేనా..?


కల్లోలిత    నదీమ  జలాన్ని  ఈదలేని ,
నా  అనాశక్తనో,  రేరాజుకై  తపించే,
నా  అర్ద ఊపిరినీ ...ఆపాలని  చూసిన,
అమావాస్య  నిశాచరి  నీవేనా..?


వేల మొక్కుల  అనంతరం ,
నేలకు  దిగిన  రేరాజు  రేయంచులో,
నను  పలకరించు  వేళ ,
శబ్దించిన  ఆ  అపశృతి   నీవేనా  ......?


ఇంతకీ ...,

నువ్వు   నీడవా... ?  జాడవా ...? మనో  దారివా ...?