Pages

Monday 14 December 2015

ఏకాంత శిల




ఏకాంత  శిల 





శబ్దాన్ని   మరచి చలనాన్ని  విడిచిన ,
అనిశ్చత ,అంధకార, నిరాకార ,ఆవాహన ,
ఉద్విగ్న  అక్షర ప్రియం ...,

వేన వేల భావాలకు   బాసటగా నిలిచినా ,
పదాల ,పెదాలపై ..పల్లవించే  తీయని  పరిమళాల,
హృది దోసిలి  నిండా  సజీవ  జ్ఞాపకాలు ...,


పారిజాతాలై  
మది  మందిరాన  రాలుతూ...   ,
మౌనాన్ని  తట్టి లేపి ,మాటను  పట్టి  తెచ్చి ,
మనస్సుకు  లిపి  నేర్పిన  సమయాన ..,

 ఏదో  రూపం ,మరేదో  మోహం...,
జీవన  గతిని  మార్చాలనీ,
అనివార్య ,నిర్వికారత ,విఘాత  తలపుల ,
వికృత  శాపమై ....,

నను  సుషిప్తిలోనికి  జార్చాలని ,
విశ్వ ప్రయత్నం చేసే ....  ఓ .... ఏకాంతమా...,



ఉలిని  చేతబట్టి ..,
శిలను  చెలిగా  మలచిన ..,
మనోహరుని  సాన్నిహిత్యం ...,
నీకు  అల్విదా   పలుకుతుంది .... వినుమా... .,


Wednesday 25 November 2015

ఓ సారి ఇటు చూడు



ఓ సారి   ఇటు  చూడు 



చందురూడా .... !
నీ సిరివెన్నెల   సిరులోలుకుతూ ..,
చిరుజల్లుల  మరులోలుకుతూ ..,
రేరాణి  మధుపర్కములను  తమీతో   తడుపుతూ ..,


కలువలరాయడా ...!
తారకలన్నీ దివి  తోరణాలై  వెలుగుతూ..,
మబ్బుల   సెజ్జపై  వెలుగులద్డుతూ..,
మింటి  ఇంటికి    ఇంద్రధనువు   గొళ్ళెం పెడుతూ ..,


రేరాజా...!
అనిలుని  కవ్వింతను  అనలముగా   తలంచుతూ..,
ఇనునికి,వారిజమునకూ  ఈర్ష్య  కలిగించుతూ.., 
మనో  మందిరాన  పూలశరాలను  సందించుతూ ...,
కలువభామ  ఆకసానికి  మేఘాల  మెట్లు కడుతున్నది   

Saturday 22 August 2015

రంగులడబ్బా సరిజేసుకో బిడ్డా ....



     








రంగులడబ్బా  సరిజేసుకో బిడ్డా ..... 





పొద్దుగాల నుండి  గా  రంగుల  డబ్బాలోకెల్లి ,
ఒకటే  ఒర్లుడు , పోరగాల్లు  తినేటివేన్దో   పాడయి  జచ్చినాయంట ,

అస్సలు  గీళ్ళకి  తెల్సా.. ..,
మా ఇంట్ల  పోరగాల్లకి  బువ్వ దొరుకుడే  కష్టం ,

గాయమ్మ   ఎవ్వరో   సిన్మాపోరినట  ఎవ్వనినో  ప్రేమించినదనీ... ,
పెళ్ళిలో  కెల్లి  పారిపోయినాదనీ .... ఒకటే    సూపెట్టుడే ,


కులపోల్ల    అదిలింపుల్లో ... ..పురుగుల మందు దాగి,
ఊరిపొలిమేరల్లో  పోయిన  మన   ఊరి పోరి  కనిపించలేదారా...? 

అరె  బస్టాపలకెల్లి    బద్మ్మాష్ గాళ్ళు ,
ఆడపోరిలను  ఆగమ్జేస్తుండ్రు   గదా...  గది  కన్పడదా.... ?

గాయనెవరో   పైదేశానికెల్లి    పైసలుబోసి  పొట్ట  మెలికలు  దిప్పుచ్చుకున్నాడంట ,
ఇక్కడ   కడుపుతోనున్న  ఆడకూతురు  ఆసుపత్రిబైటనే  పురుడుబోసుకొని  పీనిగయ్యింది,
గది కానొస్తలేదారా  మీకు ,

సూటూ  బూటూ   ఏసుకున్నోల్లనో,
సినిమా  హీరోలనో,
కాలేజీ పోరగాళ్ళనో,
సైబరు కేటుగాళ్లనో ,
షాపింగ్ బేరగాళ్లనో ,
దొంగనోట్ల  దొరగాల్లనో ,
కబ్జాల  గజ్జిగాల్లనో,
దొంగ బాబాగాల్లనో ,
రంగుటుంగరాల్లోల్లనో , కాదురా  మీ  ఇంటర్యూలతో   ఊదరగొట్టుడు....,

ఇల్లులేనోళ్లనీ,  కళ్ళులేనోళ్లనీ, రోగాలు  ముసురుకున్నోల్లనీ, మురికి  కాలువల్లో  కాపురమున్నోల్లనీ, దోమలతో దోస్తీజేసేటోల్లనీ, ముస్టోల్లనీ, కుస్టోల్లనీ,  అనాథలనీ, అన్నార్తులనీ ...ఇంటర్యూ  జేయండి ...., గాళ్ళ  లొల్లి  ఏందో   ఎల్లబెట్టుండ్రి . 

రంగుల డబ్బాకు   హంగులే   కాదు  ఆకలి    జూపించుడు  ఎప్పటికీ  తెల్వదా ??? 

  


  


Friday 14 August 2015

నువ్వేనా...?











నువ్వేనా...?

సుదీర్గ    నిశ్శబ్దం   ఆవల ,
అనంత  ఒంటరితనం  వెనుక  నక్కిన ,
అలుపెరుగని  నా  మనో కలల
అన్వేషితవు  నీవేనా...?


నా భుజం  పై  నేనే  తలవాల్చుకొని ,
ఒకింత  ఓదార్పుని  ఆశించిన  క్షణాన,
వెన్నంటి   ఉన్న  మనో చాయని ,
ఏమార్చిన   విభావరి   నీవేనా..?


కల్లోలిత    నదీమ  జలాన్ని  ఈదలేని ,
నా  అనాశక్తనో,  రేరాజుకై  తపించే,
నా  అర్ద ఊపిరినీ ...ఆపాలని  చూసిన,
అమావాస్య  నిశాచరి  నీవేనా..?


వేల మొక్కుల  అనంతరం ,
నేలకు  దిగిన  రేరాజు  రేయంచులో,
నను  పలకరించు  వేళ ,
శబ్దించిన  ఆ  అపశృతి   నీవేనా  ......?


ఇంతకీ ...,

నువ్వు   నీడవా... ?  జాడవా ...? మనో  దారివా ...?











Wednesday 17 June 2015

" సమజవతలేదు "


                   









" సమజవతలేదు "




దిమాక్   కరాబయ్తాంది
గీ ..   బతుకులు    జూస్తుంటే,

ఏటికేడు  కాలమవతాదనుకుంటే,
ఆగమవతానే     ఉండాది.

పోరగాడి సదువు  పూర్తయినాదిలే  అనుకుంటే ,
కొలువు  పతంగై   పైన   కూచున్నాది.

గీ   పల్లెలో   ఏముంది,
నీళ్ళకోసం   మైళ్ళు   నడుసుడయ్యే ,

ఊర్ల నీళ్ళు  దాగితే ,
కాళ్ళు   వంకర్లు   బోవుడే  ఇగ.

 అవ్...  ...ఒక్క మాటడగాల్నే  నిన్ను ,
ఓటు  దీసుకుంటివి  గదా..మా   దూప దీర్చవా?


ఇంగితముంటే ,
జరా  సొంచాయించు,
గాయనెవరో  మూటగట్టుకున్నాడు,
గీయనెవరో  ముల్లె గట్టుకున్నడు ,

గీ   భోగాతమ్ రోజూ   ఉండెడిదే,
మేము  గట్టిన  శిస్తులూ ,మేము  గట్టిన పన్నులూ
మస్తు  అయితాయి  గదా ...,


మరి ,
గాడేమి  పట్టుకెల్లిండో, గీడేమి  పెట్టి ఎల్లిండో,
ఏలి  ముద్రగాళ్ళమ్   మాకేమెరిక?



అయినా నాకు  తెల్వక  అడగతా.... ,
అందరూ  గల్సి ,జాతరలెక్క  జమయ్యి ,
మా   పీనిగిల  మీదకెల్లి ....చిల్లరేరుటేందే ......సమజవతలేదు


Wednesday 27 May 2015

" నీవు నా ప్రాణమే "








 " నీవు   నా ప్రాణమే "


బలాత్కరించబడ్డ  క్షణాలన్నీ....
బంధీలైన  గడియలన్నీ....,
నిఘా  వెనుక  భయాలన్నీ...,
జీవితం పై  దాడి  చేసే  వేళ ...



అగాథాల  అంబుధిలో ..,
విఘాతాల  వనాలలో ....
వసంతం పారిపోతుంటే ,
శిశిరం   వచ్చి  చేరుతున్న వేళ ,



నా కళ్ల మీదుగా   ప్రవహించే
నెత్తుటి  నదులను  తొలగించి ,
నిశి  రాతిరిని  పండువెన్నెలగా  మార్చిన ,
శరత్ చంద్రునివి   నీవు .




గుండెలకు  తుపాకులు  పెట్టినా ..,
చెదరని  విప్లవ  పక్షులు,
నా  మనో  గాయాలు ,



ఓ  సందిగ్ద  సాయంకాల  వేళ ,
చిక్కుపడిన    నా  ఆలోచనా  వల,
చలించిన  నా  మనో  కల ....,



ఉట్టికాళ్లతో    మండుటెండలో  నడిచే
పసిపాప   పాదాల     వేధన  నాది ,

కాలిన  పాదాలకు  నవనీతం  అద్ది,
అక్కున  చేర్చుకున్న అయ్యతనం  నీది,



ఎలా  సాద్యమైంది ,  నీకిదంతా ...?
ఎలా   దూరమైంది ,నా   వెతంతా...?



శరీరమంతా  రెండు  చేతులుగా  చేసుకొని,
కృతజ్ఞతతో  నీకు    నమస్కరిస్తున్నాను



Thursday 7 May 2015












మాలిమైన  పావురాళ్ళు , నా అక్షర  స్నేహితురాళ్ళు.

   తిరణాలలో  తప్పిపోయిన
   బీద  పసిపిల్లలు,

   దిక్కుతోచక ..ఆకలితో ఏడిచే
   అనాథ  బాలబాలికలు .

   నా కలం లోని   సిరాచుక్క నుండి ,
   ఎగిసి  పడే  ఎర్రని  రక్తాక్షరాలు

   మరల మద్య  మరల, మరలా తిరిగే
   అలుపెరుగని  కార్మికులు,


   పట్టెడన్నానికై ..ఎండని  సైతం లెక్కచేయని,
   వెట్టికి   అలవాటైన శ్రామికులు
 

 
కష్టాలకూ,నష్టాలకూ తలవంచి ,
అధికదరల  తలారికి  తలనిచ్చే

   అరాచకాలపై సమర భేరి మోగించిన,
   అక్షర శంఖాలు.

   నిదుర కాసి  నేను అల్లుకున్న
   జాబిలి వెలుగులు.

   అలుపే  ఎరుగని  నిరంతర పోరు సలిపే,
   అక్షర  వీరులు.

   ప్రతి సాహితీ ప్రియుని పలకరించే,
   ప్రేమ మాలికలు.

   విద్యావంతులైన  మీ ఆశ్శీస్సులను  నాకందించే,
   శుభాషితాలు

  

Sunday 12 April 2015

శరత్ కాల చలన క్షణం








శరత్ కాల   చలన క్షణం







పొడి పొడిగా  నేల  రాలే ..
వెన్నెల పలుకులను
ఏరి  కోరి  శీతల  రాత్రుల
శిథిల  జ్ఞాపకాల  సమాదిపై
మధుర   రాసులుగా   పోస్తూ ...,








కనురెప్పల  వెనుక
నిలిచిపోయిన  రూపాన్ని
విఫలమై  విరిగిపడే  కాలనీ,
పోటెత్తే  హృదయ  సంద్రాన ,
మది  అలలపై   మమకారంగా  అద్దుతూ ..,








వెలసిపోయిన  మనో ఫలకంపై
కలసి  వేసుకున్న  రంగుల  చిత్రాన్ని
పెచ్చులూడిపోకుండా  పెదవులద్ది ,
వ్యధిత  హృదయంతో   విలపిస్తూ ...,  








కలత పడకు  కలకాలం తోడుంటానన్న ,
కలువల రేడు  కనుమరుగైతే
ఆకసమంతా ...కలయదిరిగి ,
జాడ  తెలియని    ఆడ  హృదయం
తరతరాలుగా   తలపోస్తూ..  విలపిస్తూనే ఉంది .    








Thursday 19 March 2015

సంహిత.

    





   సంహిత. 

    నేను  కలలు  కనటం  మానేసినప్పుడల్లా,
    నన్ను వెతుక్కుంటూ వస్తుంది. 

    నాపై రవ్వంత చిరునవ్వునీ,కొండంత కోపాన్నీ,
    కుమ్మరించి హడావిడిగా, 
    వెడలిపోతుంది. 

    నా  ముంజేతి పై ముద్దు పెట్టి,  చెవి మెలిపెట్టి, 
    నెత్తిపై  మొట్టి, తడబడుతుంటే  
    తమాషా చూస్తుంది. 

    అనంత  జనాంబుధిలో  ఉక్కిరిబిక్కిరై ,
    దిక్కుతోచక నేనుంటే, 
    లంగరేసి పక్కకు లాగుతుంది. 

    నన్ను పొద్దు తిరుగుడు పువ్వులా తిప్పి,తిప్పి,
    రాత్రికి తులాభారమేసి, 
    సత్యకు అమ్మేస్తుంది. 

   కునుకుపడేవేళ  కురంగిలా వచ్చి,
   అంతులేని ఈర్ష్యతో,
   సివంగిలా  గర్జిస్తుంది. 

    వెదురు వేణువునై  నేను  వేదన వినిపిస్తే..,
    నన్ను పొత్తిళ్ళలో పాపాయిని చేసి,
    హత్తుకుంటుంది. 

    చిరు గడ్డాన్ని చివుక్కున  కొరికి,
    బిక్కమొఖం వేసిన నన్ను, 
    అక్కున చేర్చుకుంటుంది. 






Saturday 28 February 2015

"నివురునైన...ఇచ్చోట. "










"నివురునైన...ఇచ్చోట. "







మోహమో .. మోదమో ...,
పలవరమో...  ,పరవశమో .... ,


తనువంతా  మనసైన చోట ,
అణువణువూ  నివురైన ఇచ్చోట,


ఊరికి  దూరంగా   సుదూరాన,
నిశీధి ,నిశ్శబ్ద   సాగర తీరాన,

నీ  వెచ్చటి  సజీవ  జ్ఞాపకాల  తరగల్లో,
ప్రేమనూ, కాంక్షనూ తలపుపతడిలో  ఒలికించి ,

ఈ  ఏకాంతవాసం లో,
ఒంటరితనపు ఒద్దిక  బ్రమనై,


నీ   చలన రహిత శరీరాన్ని ,  
శ్వాసించని  నీ ఎడదనూ ,  
నా కంపిత మునివేళ్ళతో ....పరామర్శిస్తుంటే ... ,




ఒక్కసారి    నా కన్నీళ్ళలో   ప్రతిబింబించు,
నా ఉచ్వాస ,నిశ్వాసలను  నిర్బంధించు , 

సగం కాలి కమురువాసన వేస్తున్న ,
నా సురుచిర   స్వప్నాలనూ ,
నా పునరావృత  పలవరింతలనూ .... పరామర్శించు. 


కళ్ళుమూసుకొని   రెప్పలపై  ఆరబోసుకున్న ,
ఆ వెన్నెల  రాత్రులను ,మోహపూరిత  క్షణాలనూ, స్మరించు,

విజయమో ,వీరస్వర్గమో   దక్కించుకున్న ,
నీ  శిరశ్చేదిత  దేహామూ , 
మట్టి దుప్పటి కప్పుకున్న  నీ మౌన కాయమూ.... ,


నన్నిలా  కలల  మూగసాక్షిని  చేసి ,
 ఈ నిశ్శబ్దరేయి  నిర్దయగా ...నను  నిశాచరిని చేసి  నిష్క్రమిస్తుంది 
  











Tuesday 24 February 2015

జీవితమా... శాసించకు







  "జీవితమా... శాసించకు"



ప్రతి అడుగుకూ ..అడ్డుపడే సంఘటనలూ ..,
తల  వంచుకొని    తడబడి  చెప్పే   సంజాయిషీలూ ...,


మానసిక    పరిపక్వతా   దశలోనే ....,
ఎదురయ్యే    వెదురుముళ్ళ   నిబంధానాంక్షలూ ...,


రెక్కలు విరచబడీ.. ... ముక్కులు కత్తిరించబడిన ,
వనాంతర   విహంగ    విహారాలూ...,


బలాత్కరించ   నిశ్శబ్ద   క్షణాల మీద ,
మౌనముద్రల  మానసిక  మారణహోమాలూ ...,


ఆత్మజులూ.....అత్మీయులూ, అంతరాత్మలూ ..,
నిర్దాక్షిణ్యంగా  నిరసించే  నిష్కృమణలూ ...,


బ్రతుకు  శిశిరాన   రాలుతున్న   హరిత పత్రాలూ...,
మోడువారిన  ఎడారిన  మురిపించే  ఎండమావులూ.... 


బిక్షమడిగే   బీతిల్లిన   బాదామయ బంధీకానాలూ..,
నీడసైతం    వీడిపోని   అనిశ్చత.... ఆలింగనాలూ..,







Tuesday 10 February 2015

అనిశ్చతాక్షరాలు

 

















అనిశ్చతాక్షరాలు 



మది ధరణిలో మొలకెత్తే 
విత్తనమే అక్షరం,
మనల్ని  మంచి బాటన  నడిపించే,
మల్లెల బాటలే  మన రాతలు  






బతుకు పూదోటలో,
ముల్లులా గుచ్చుకున్నా, పువ్వులా విచ్చుకున్నా,
తరతరాలుగా నీడనిచ్చే తరువు   కావాలి . 


హృదయ   సంద్రాన   ఉవ్వెత్తున ఎగసిపడే
భావకెరటం   కావాలి,
మూతులెల్లబెట్టే   పీత పిల్లలు కాకూడదు. 


తప్పుడు  తలపులను తెచ్చే ,
చప్పుడు చేయని  రహస్య  రాగం  కాకూడదు,
తర్కం   కొలిమిలో  కాగి,సాగి ,
నిర్మాణకారికో, విప్లవకారికో  రహదారి కావాలి.    

లక్ష్యంలేని  పిచ్చికుక్కల్లా,
చివుళ్ళుమేసే  గొంగళ్ళులా ,
చేటు చేసే  చాటు  రాతలై ,
అసాంఘిక సమస్యలై  విస్తరించకూడదు. 


గుండెలో చిటికెడు ఆత్మా విశ్వాసం  లేకున్నా,
అనైతికపు అంగబలం తో ,
మెచ్చుకోలు  ఉచ్చులకై  చీకటి చెట్లు ,
అక్షరాలను  గబ్బిలాల్లా   వేలాడదీయకూడదు. 

చేతకాని, చేవలేని, మార్పులేని, 
విలువలేని, మంచిలేని, వంచన రాతలు ,
వ్యవస్థను  శాశ్వత  వికలాంగనగా మార్చి , 
నిఘాలేని  దగాకోరు  రాతలే అవుతాయి .

  











Sunday 11 January 2015

కొత్త బాటలో. ....,





















 కొత్త బాటలో. ....,



 మస్తిష్కాలు  సైకత తీరాలు  కాకముందే
 మనసంతా  ముళ్లజెముళ్ళు  మొలవకముందే,


అదృశ్య బంధాలు  ఆక్టోపస్లు  కాక ముందే ,
గుండెల్లో  విషాన్ని  పిచికారీ   చెయ్యకముందే,

వెన్నులేని   వాగ్దానాలు   వమ్ముకాకముందే  ,
 కన్నుగప్పి   మనస్సును   కమ్ముకోక ముందే,

మనో   ఆకశాన     స్వేఛా   విహారానికై
మానసిక     రెక్కలు    విప్పే  విహంగమై .....,సాగిపో ...(ఇదే  స్వయ  ఆవిష్కరణ)

Wednesday 7 January 2015

మతలబుల మతాబులు












మతలబుల   మతాబులు

పురుషం అంటే
కత్తిపట్టుకొని,
కదను తొక్కటం కాదు.

అన్నార్తులకు  అండగా నిలిచే అక్షరాయుధం  కావటం.

విద్యాధికులంటే,
పట్టాలు బుట్టలకొద్దీ
కలిగి ఉండటం కాదు ,


నిరక్షరాసులకు  నీడగా    అక్షర   ఆదరణ   కావటం.



సంస్కారం అంటే,
వంశి  వృక్షము  నుండి
తెంచుకొనేది కాదు,

వినయ, విదేయతలతో  పెద్దలయెడ  ఒదిగి ఉండటం.

సహాయం అంటే,
అన్నార్తులకు ,
ఎంగిలి చేయి విదల్చటం  కాదు ,

పెంతందారీ  నిప్పుల  వంతెనపై   ఉప్పెనై  పోటెత్తటం.