Pages

Monday 29 September 2014

ఊపిరి కోతలు



ఊపిరి కోతలు 
ఊపిరి కోతలు 

చైతన్యాన్ని  శిలువు వేసి 

మేధను అనాథను చేసి 

అమావాస్యను  ఆభరణంగా చేసి,

దేహపు ఆకటికి  చీకటి ముసుగేసి,

హృదయం లేని మొండేలను

ముఖపుస్తకపు దండేలపై 

విచ్చలవిడిగా ఆరవేసి 

ఉన్మాదానికి ఉన్నతమైన 

"పసితనం"  అనే పేరు పెట్టేసి  

ఇతరులను నమ్మించేసి 

ఎవరికి వారు అర్దం లేని స్పర్దల్లో

నచ్చిన వారిపై 

ప్రేమాస్త్రాలను  సందించేసి 

మరులుగొన్న మనోదాహం తో,

విలువైన కాలాన్ని తాగేసి 

స్వీయానుభవాల ఊయలలూగుతూ,

ఖర్మ సిద్ధాంతాల  ఉమ్మనీరు తాగి.

తప్పంతా ఇతరులపై రుద్దేసి ,

ఆపేక్షా,ఉపేక్షల ఉరితీతలలో,

ఏది వసంతమో, ఏది శిశిరమో

తెలీక, యదార్దాలను రాల్చేసి 

సంకుచిత తత్వాల నెగడులో

నిప్పుల స్నానం  చేస్తున్న కాలంతో

రుగెత్తలేక  నుసిలా రాలుతున్న మనం 



ఇకనైనా....... ,


కొన్ని నిజాల ఇజాలను  భుజాలకెత్తుకుందాం 


Tuesday 23 September 2014

కలం కదిలించు

    
    కలం కదిలించు 

     కాలమనే కత్తి  మీద 
     కలాన్ని కదిలించు
     ఎగిరిపడే నిప్పురవ్వలు 
     కవివైతే నిన్ను కాల్చేస్తాయి. 

     ఏ మూలనో అణువంతైనా ,
     ఆవేశముంటే ,
     చచ్చిన శరీరాంగమైన,
     నీ కలాన్ని కదిలించు. 

     పుక్కిట  పురాణాలనూ,
     బొంకుల బోగాతాలనూ ,
     చెత్తబుట్టకు చుట్టాన్ని చెయ్యి . 
     బాల కార్మికులకై  అక్షర బాటవెయ్యి. 

     మతాల దడులూ, కులాల కంచెలూ ..,
     కట్టి ,గద్దలు  తన్నుకుపొయే ,
     ఉద్యోగాలను  ఉట్టికొట్టి ,
     రచ్చకీడ్చి , నీ  కలంతో  కడిగెయ్యి . 

     ఆకటి పేగులకు  
     అన్నం ముద్దవి కావాలంటే,
     నీ కలాన్ని అనలం లో కాల్చి ,
     సానబట్టి , వర్గ ,వర్ణ  ప్రాంతీయ బేదాలపై ,
     వేటు వేయి. 

      (లేదంటే .... కవులారా  మనమంతా  
       పుచ్చిపోయిన మన కలం పాళీ  విరిచి ,
       వెన్నెల్లో తనువును ఆరబోసుకున్న 
       పూభోణి గురించి  రాసుకొని  
       మనకు మనమే చొంగ కార్చుకుందాం )








Sunday 21 September 2014

నడిచే్ నెలవంక

    





    నడిచే  నెలవంక

    ఈ చందమామని ఎవరో పారేసుకున్నారు,
    కాదు ,కాదు గగనానికి అమ్మేసుకున్నారు. 

    మసిబారిన ఆకాశాన్ని అంటుకుని ,
    కొడిగట్టిన  దీపం లా  వేలాడుతూ,
    నాకు కనిపించాడు.

    నిదురరాని రేయిని ,
    ఆరుబైట ఆరబెడుతూ,
    ఆకాశాన్ని  చూశాను

    శీతాకాలపు చలిరాత్రికి,
    బుజ్జి కుందేలుపిల్లలా,
    ముద్దు,ముద్దుగా, 
    నేలపైరాలిన నక్షత్రాల మద్య,
    మినుగురులా  మెరుస్తున్నాడు 

    చాపిన  నాచేతుల్లో,
    ఎగిరొచ్చి వాలిపోయాడు ,
    సుతిమెత్తని  చీరకొంగుతో..,
    సున్నితంగా  చిట్టి గడ్డంపై  రాశాను,
    పొగడపూలలా నవ్వాడు.

    ఏ త్యాగానికై   ఈ  గందర్వుడు,
    ఇలా గగనం విడిచాడో,
    నేలపై  ఎవరిని వెతుకుతున్నాడో..,
    తిరణాలలో తప్పిపోయిన పసి కూనలా,
    బిక్కు,బిక్కు మంటున్నాడు. 

    ఒక నిస్సారమైన ఆత్మాహననం నుండి ,
    తనని తాను  రక్షించుకుంటూ,
    జీవన రేఖపైనే బ్రమిస్తున్నాడు,

    నా  చిటికిన  వేలు  పట్టుకొని ,
    మెల్ల,మెల్లగా నడుస్తున్నాడు,
    ఆ స్వప్న   సముద్రాన ,
    సూర్యో్దయమైనాడు.


  


Thursday 11 September 2014

స్పందన కరువైన క్షణం


    






   

స్పందన కరువైన క్షణం




కాసిన్ని పలుకులను

తలపులనుండి తోడిపోసుకుంటూ..

ఎన్నిసార్లు నొత్తురోడిన గాయాన్ని..,

మాన్పుకోవాలనుకున్నానో ....,


ఎడతెగని మోహానికి ఆనకట్టవేసి,

కలల నౌకని కడలిలోనే,

బడబాగ్నికి ఆహుతి చేసుకున్నా..


జీవితమంతా .జీవితాన్ని

మరచిపోయెందుకే వెచ్చిస్తూ..,

మనస్సునెక్కడో పారేసున్నా..,


సగం చేసుకున్న ఈ ఊపిరి సంతకాన్ని,


నీ అకాల ఆగమనంతో..,

శాశ్వత చిరునామాగా మార్చుకున్నా..,


నీవు రాసిన వీడ్కోలు కాగితం ముక్కను

నా అసంపూర్ణ జీవన గ్రంధానికి,

ఆకరి పేజీగా అతికించుకున్నా. ..,

.,