Pages

Saturday 27 July 2013

అమ్మతనం







 


   

కల్లు తాగిన కారుకూతల్లో

తన తల్లినే పతితగా వింటుంది.


కట్న కానుకలు తక్కువనే కరకునోళ్ళకు ,

జడిసి తల వంచుకుంటుంది.


ఆడపిల్లని కన్నావని తూలనాడినా,

తప్పు తనదే అనుకుంటుంది.


బిడ్డల నడవడిక బాగలేకున్నా,

తానే కారణమంటే నిజమే అనుకుంటుంది.


యెడారి ప్రస్తానంలో తీరని దాహాల వెంట,

పరుగులెడుతూనే ఉంది.


నడివయస్సులో కూడా తనవారికోసం,

పడిలేస్తూ పనిచేస్తూనే ఉంటుంది .


కన్నకూతురికి పెళ్ళి చేసి ,

తనలాంటి రాత వద్దని మొక్కుకుంటుంది.


కోడలి నాగరికత ముందు,

నిశాని అయిన తానే తలఒగ్గుతుంది.


అందరిలో ఉన్నా ఒంటరితనం,

తన తప్పులేకున్నా నిందమోసేతనం.


ఇంటిల్లిపాదికీ  నీడనిచ్చే తరువుతనం,

అమ్మ ప్రేమ  కానే కాదు ఎప్పటికీ అరువుతనం.

Thursday 25 July 2013










   "అందరూ కలసి రండి"

   అందరూ కలసి రండి,
   గొంతు దిగని దు:ఖాన్ని
   పంచుకుందాం రండి.

   చీకటి కోణాల నుండి,
   మురికి కూపాల నుండి ,
   గాయాల గేయాలు విందాం రండి.

   లేత ప్రాయపు నగ్న గుండెలపై,
   నర్తించే ఆకలి చూపుల,
   అన్యాయాలను అరికడదాం రండి.

   రాజదాని నడిబొడ్డు మీద,
   నాట్యమాడే లైంగిక ఆనందాన్ని,
   అడ్డుకుందాం రండి,

   నడిచే దారిలో సంచరించే,
   అరాచక పిశాచాలను,
   అదిలిద్దాం రండి.

   కాలు కదిపితే కక్షలే,
  కంటినుండి జారేవి లావాధారలే,
  అందుకే అక్షరిద్దాం రండి. 

Sunday 21 July 2013






    




    అప్పు తప్పు 



     మెట్లు లేని దిగుడుబావి నుండి,
     పైకి ఎగబాకుతున్నట్లూ,

    ఇనుప చట్రాలలో ఇరుక్కుని,
    ఉక్కుపిడికిలికై వెతికినట్లూ,

    సమాదులపై పాతిన శిలా పలకం,
    నీదే అని ఎవరో అరిచి చెప్పినట్లూ,

    సూదికళ్ళతో వెతుకుతూ డేగ కిందికొస్తే,
    బిక్కచచ్హిన కోడిపిల్ల పరుగెత్తినట్లూ,

    నిదుర రాని కనురెప్పలపై,
    గబ్బిలం  రెక్కలు విదిల్చినట్లూ,

    అరువు తెచ్హిన ధనం హారతి కర్పూరం అవుతుంటే
    గొప్పలకి పోయి జబ్బలు చరుచుకున్నట్లూ,

    అప్పు ఎగ్గొడుతావని లోకమంతా నీకై,
    వలవేసి వెతుకుతున్నట్లూ,

    కొన్ని సందర్భాలూ,సందేహాలూ,కలసి ,
    నిన్ను కత్తి అంచున కూర్చోబెడుతున్నట్లూ,

    అవును నువ్వు ఇంకెప్పటికీ దొరకవేమో అన్నట్లూ
    అప్పుచేసి పప్పుకూడు తినకూ అని ఎవరో అన్నట్లూ.