ఏల ఈ తిరస్కారం ?
నీ హృదయం నవనీతం కదా..మరి ఎందుకు,
నా కాలిన గుండెగాయాన్ని మాన్పదు ?
నీ మనస్సు అమృతం కదా మరి ఎందుకు,
నా మది బాధను ఎమార్చదు ?
నీ అడుగులు ప్రతి పదం వైపే కదా మరిఎందుకు,
నా నడకలకు గమ్యం చూపవు?
నీ స్నేహం సాగరం కదా మరిఎందుకు,
నా బ్రతుకునకు ఎదురీత నేర్పదు ?
నీ జ్ఞానం దీపం లాంటిది కదా,మరిఎందుకు,
నా తలపులకు దారి చూపదు?
నీ బంధం ఆదర్శమైనది కదా మరిఎందుకు,
నా సాన్నిహిత్యాన్ని ఏమారుస్తుంది ?
నీ భోదన ఓదార్పు కదా మరిఎందుకు ,
నా వేదన ఎన్నటికీ తీరదు?
నీ ప్రేమ సెలయేరు కదా మరిఎందుకు,
నా అనురాగార్తిని తీర్చదు ?
నీ కరుణ మేఘం కదా మరిఎందుకు,
నా మీద దయా వర్షం కురిపించదు?
నీ శాంతం ఓ కపోతం కదా మరి ఎందుకు
నా ఆవేశాన్ని సమర్దించదు ?
నిన్ను వరించటం నేను చేసిన దోషమా?
నిన్ను ప్రేమించటం నేను చేసిన నేరమా?
ఎందుకీ మౌనం ,ఏల ఈ తిరస్కారం?
ఎందుకీ దైన్యం, ఏది పరిష్కారం?
అపరిచితురాలిలా..అపరాదిలా ..అనామికలా ..
ఎన్నాళ్ళిలా..తెరువరిలా..సాగిపోవాలా.......